గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా మారనున్న హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | TS Govt Plans GHMC Convert to Greater City Corporation-2024
TS Govt Plans GHMC Convert to Greater City Corporation: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యాంశాలు :
- హెచ్ఎండీఏ పరిధిలోని 7కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల విలీనం
- ఒకే కార్పొరేషన్గా ఏర్పాటు చేసే యోచన.. . లేకుంటే నాలుగు కొత్త కార్పొరేషన్లుగా విభజన
- తూర్పు-పశ్చిమ-ఉత్తర-దక్షిణ హైదరాబాద్ సిటీలుగా పేర్లు.. సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన
- గ్రేటర్ సిటీలో అన్ని ప్రాంతాల ఏకరీతి అభివృద్ధే లక్ష్యం
- అధ్యయనం చేయాలని మునిసిపల్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
TS Govt Plans GHMC Convert to Greater City Corporation
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు.
పాలకవర్గాల పదవీకాలం పూర్తయ్యాకే..
ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన..
జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో..
దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్ గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి.
30 మున్సిపాలిటీలివే..
- రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్
- యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి
- సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల
- మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
దొంగిలించబడిన పద్మ పతకం దొరికింది, నలుగురి అరెస్ట్..| Stolen Padma Bhushan Medal Found-2024