...

Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ

Written by lsrupdates.com

Published on:

Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ

Rajdhani Files Movie Review-2024: పార్టీల జెండాలు, అజెండాలతో రాజకీయం కోణంలో రాజధాని ఫైల్స్ తీయలేదు. ఇది ప్రజల కోసం.. రైతుల కోసం తీసిన జాతీయ జెండా లాంటి చిత్రం’’ అని రాజధాని ఫైల్స్‌ని థియేటర్స్‌లో వదిలారు. మరి నిజంగానే ఇది జాతీయ జెండాలాంటి సినిమానా లేదంటే.. ఒక పార్టీకి కొమ్ముకాసే రాజకీయ అజెండానా? అన్నది సమీక్షలో చూద్దాం.

Rajdhani Files Movie Review-2024 | సినిమా కూడా ప్రచారసాధనమే..

అయితే ఈ ప్రచార సాధనాన్ని వచ్చే ఎన్నికల్లో ఆయుధంగా మార్చుకున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు. ఇప్పుడు ఎలాగూ టీవీ ఛానల్స్, పేపర్స్ చూసి.. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. ఆయా పార్టీలకు సొంత ఛానల్స్, సొంత పేపర్స్ ఉన్నాయి. ఇక జనం వాటిని చూసి నమ్మే పరిస్థితి లేదు కాబట్టి.. సినిమాలపై పడ్డారు. మొన్న ‘యాత్ర 2’ అంటూ అధికార పార్టీ ఎన్నికల అస్త్రం వదిలితే.. ఇప్పుడు ప్రతిపక్షపార్టీ ‘రాజధాని ఫైల్స్’ అనే అస్త్రాన్ని వదిలింది.

Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ
                                         Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ

వెలగగూడెం గ్రామంలో దగాపడ్డల రైతు ఆవేదనే ‘రాజధాని ఫైల్స్’ కథ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత.. అప్పటి అధికార పార్టీ అమరావతి (సినిమాలో అయిరావతి) రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తుంది. భూములు ఇవ్వడానికి అక్కడి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే అక్కడ 40 గ్రామాలకు గ్రామ పెద్దగా ఉన్న నడిమిట్టి కేశవులు (వినోద్ కుమార్).. రాజధాని ఏర్పాటు వల్ల ఉపయోగాలను రైతులకు చెప్పి భూములను ఇవ్వడానికి ఒప్పిస్తాడు. దీంతో అయిరావతి రైతులంతా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములిస్తారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతుంటాయి.

ఇంతలో ఎలక్షన్స్ వచ్చి..

ఇంతలో ఎలక్షన్స్ వచ్చి.. ప్రభుత్వం మారుతుంది. తెలుగుదేశం పార్టీ (సినిమాలో ప్రజాకిరణం పార్టీ)పై కేఆర్ఎస్ (వైఎస్ఆర్‌సీపీ) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయిరావతి రాజధానికి బదులుగా.. నాలుగు రాజధానులు ప్రకటన చేస్తారు. దీంతో అయిరావతి ప్రాంత రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన యుద్ధంలో కేశవులు కుటుంబంతో పాటు రాజధాని ప్రాంత రైతులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం వారిని ఏవిధంగా అణచివేసింది. కేశవులు కొడుకు గౌతమ్ (అఖిలన్ పుష్పరాజ్) ప్రభుత్వానికి ఏవిధంగా బుద్ది చెప్పాడు? అయిరావతి రాజధాని ఏర్పాటుకు గౌతమ్ ఏవిధంగా పరిష్కారం చూపించాడు అన్నదే మిగిలిన కథ.

రాజధాని ప్రకటన..

రాజధాని ప్రకటన.. భూములు ఇవ్వడం.. ప్రభుత్వం మారడం.. రైతు ఉద్యమం.. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. వాస్తవ ఘటనల ఆధారంగా బలమైనమైన సన్నివేషాలు.. భావోద్వేగ ఘటలతో రాజాధాని ప్రాంత రైతుల ఆవేదనను కళ్లకి కట్టారు. రాజధాని ప్రాంత రైతులకు అయితే ఈ సినిమా ఓ ఎమోషన్. దర్శకుడు చెప్పింది.. చూపించింది వాస్తవమా? అవాస్తవమా? అందులో నిజం ఎంత? కల్పితం ఎంత? అనే చర్చను పక్కనపెడితే.. రాజధాని అంశంలో రైతులకు పడిన ఆవేదనను.. మానసిక క్షభను కళ్లకి కట్టాడు దర్శకుడు భాను శంకర్. ‘అర్ధనారి’ అనే సామాజిక సందేశం ఉన్న చిత్రం తీసి ఐదు నంది పురష్కారాలను అందుకున్న ఈయన ‘రాజధాని ఫైల్స్’కి పొలిటికల్ టచ్ ఇచ్చారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులపై సర్కారీ దమనకాండను నాటకీయంగా చూపించారు. రైతులపై జరిగిన దారుణాలను చూస్తుంటే.. రక్తం మరిగిపోయేట్టుగా నాటకీయతను జోడించాడు దర్శకుడు.

‘రాజధాని ఫైల్స్..

‘రాజధాని ఫైల్స్.. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. రైతుల కన్నీళ్లు తుడుస్తూ సమాజాన్ని చైతన్యపరిచే ఓ సామాజిక బాధ్యతతో కూడిన సినిమా’ అని దర్శక నిర్మాతలు ఎంత చెప్పినా.. ఇది అధికార పార్టీపై ఎక్కుపెట్టిన బాణంలాగే ఉంది. అధికార పార్టీ సీఎం పేరు కూడా ప్రస్తావించలేదు కానీ.. ప్రతిపక్షపార్టీల కంటే పదునైన విమర్శలు గుప్పించారు. పర్సనల్ ఎటాక్‌కి కూడా దిగారు. సీఎం.. పదే పదే పబ్ జీ ఆడటం.. క్లైమాక్స్‌లో బాత్‌ రూంలో గొడ్డలి పోటు.. ఎన్నికల వ్యూహకర్త చెప్పినట్టే సీఎం చేయడం.. లక్ష కోట్ల అవినీతి ఇవన్నీ కూడా ప్రతిపక్షపార్టీ చేస్తున్న ఆరోపణలకు అద్దంపట్టేవిగానే ఉన్నాయి.

రైతు సమస్యల్ని..

రైతు సమస్యల్ని నిజాయితీగా చూపించడం వరకూ ‘రాజధాని ఫైల్స్’ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే రాజకీయ రంగు పులుముకుందో.. అప్పటి నుంచి కథ గాడి తప్పింది. ఒకటి నిజాన్ని నిఖార్సుగా చెప్పాలి.. లేదంటే అబద్దాన్నైనా అతికించినట్టు చూపించాలి. రాజధాని ఫైల్స్‌లో ఏది నిజమో.. ఏది అబద్దమో.. ఏది కల్పితమో.. ఏది కట్టుకథో అర్ధం కానీ కన్ఫ్యూజన్‌లో పడేశారు. కథలో గతాన్ని.. వర్తమానాన్ని.. భవిష్యత్‌ని కూడా చూపించేశారు. కేవలం రాజధాని భూములు ఇవ్వడంతో మొదలైన కథ.. తిరిగి కొత్త రాజధాని ఏర్పాటుతో పూర్తైంది. ఆ రాజధాని ఏర్పాటు ఎలా జరిగింది? దానికి డబ్బు ఎలా వస్తుంది అనే దానికి కూడా సొల్యుషన్ చూపించేశాడు దర్శకుడు. ‘మన రాజధానిని మనమే నిర్మించుకోవచ్చు’.. అనే దర్శకుడు ఆలోచన అభినందీనయమే కానీ.. అది ఆచరణ సాధ్యమా? అనేదే ఇక్కడ పెద్ద సమస్య.
Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ
                                           Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ

ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో కూడా ముందే ఊహించేశారు దర్శకుడు. అధికార పార్టీ ఓడిపోయి.. ఎన్ రాంబాబు నాయుడు (చంద్రబాబు నాయుడు) మళ్లీ ముఖ్యమంత్రి కావడం.. రాజధాని నిర్మాణం జరిగిపోవడం.. సింగపూర్ తరహా రాజధానిని చూసి మాజీ సీఎం కుప్పకూలిపోవడం.. ఇవన్నీ కూడా క్లైమాక్స్‌లో చూపించేశారంటే.. దర్శకుడు ముందు చూపు.. రాజకీయ వ్యూహం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఇక టెక్నాలజీ పేరుతో గౌతమ్..

సీఎం ల్యాప్ ట్యాప్‌ని హ్యాక్ చేయడం.. ఎంపీల ఫోన్‌లతో పాటు.. టీవీ ఛానల్స్‌ అన్నింటినీ హ్యాక్ చేసి.. లైవ్‌లో ప్రసంగాలు ఇవ్వడం వాస్తవ దూరంగా అనిపిస్తాయి. చివర్లో ఎన్నికల వ్యూహకర్తని ఫ్లైట్‌లో చంపే సీన్ అయితే మరీ లాజిక్ లెస్. అతను ఫ్లైట్‌లో వెళ్తుంటే హీరో ఫోన్ చేసి చంపేస్తున్నా అని బెదిరిస్తాడు. అసలు ఫ్లైట్‌లో పోతుంటే సిగ్నల్స్ ఉండవు.. పైగా ఫ్లైట్ చుట్టూ డ్రోన్స్‌ని పంపి బ్లాస్ట్ చేసి వ్యూహకర్తని చంపే సీన్ సిల్లీగా అనిపిస్తుంది. కథలో కీలకం అంటే క్లైమాక్స్.. కానీ ఇలాంటి సిల్లీ సీన్ప్‌తో క్లైమాక్స్‌ తేలిపోయింది.

మహిళా రైతుల్ని…

మహిళా రైతుల్ని చర్చలకు అని పిలిచి.. అరటి తోటలో అర్ధనగ్నంగా పరుగుపెట్టించే సీన్‌ హృద్యంగా అనిపిస్తుంది. మహిళా రైతుల ముందు అధికార పార్టీ ఎంపీ.. బట్టలిప్పి వాళ్లపై అత్యాచారానికి తెగబడటం.. మహిళా రైతును నరికిచంపడం.. లాంటి సీన్లతో అధికార పార్టీ ఎంపీలను చాలా క్రూరంగా చూపించారు. ‘వాళ్లు వివస్త్రని చేసింది.. అమ్మని కాదు.. రాజధానిని’ అనే సంభాషణలు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తాయి. హీరో గౌతమ్.. పోలీసుల దాడిలో గాయపడ్డ రైతుని అసెంబ్లీలోకి తీసుకుని వెళ్లి.. సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చే సీన్ వాస్తవ దూరంగానే ఉన్నా.. రైతు ఆవేదనను ప్రభుత్వానికి అర్ధం అయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు.
Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ
  Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ

‘70 మంది రైతులు విషాహారం తిని చనిపోవడం.. ఆ విషయం ఎక్కడా బయటకు రాకుండా చేయడం.. రాజధాని రైతులే ఆ శవాలను కుప్పలుగా పోసి అంత్యక్రియలు చేయడం’.. లాంటి సన్నివేషాలతో ఇదెప్పుడు జరిగింది? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉన్నాయి. రాజధాని రైతు.. ఎత్తైన భవనం ఎక్కి కింది ఉన్న గునపంపైకి దూకేస్తుంటే.. హీరో వచ్చి చేతులతో పైకి ఎత్తి రైతుని కాపాడే సీన్ సిల్లీగా అనిపిస్తుంది.

కథలో ఎంత ఎమోషన్ ఉన్నా..

కథలో ఎంత ఎమోషన్ ఉన్నా.. దాన్ని పండించగలిగే నటీనటులు ఉండాలి. వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ వరకూ ఓకే కానీ.. మిగిలిన పాత్రలు తేలిపోయాయి. హీరో అఖిలన్ పుష్పరాజ్ బాగానే కష్టపడ్డాడు కానీ.. ఆయన కనిపించిన సీన్లు సుదీర్ఘ ప్రసంగాలుగా అనిపిస్తాయి. ఆడియన్స్‌కి కనెక్ట్ కావాల్సిన కీలకమైన సన్నివేశాలు.. నిడివి వల్ల బోరింగ్‌గా అనిపిస్తాయి. ఈ సినిమాలో టీవీ 5 మూర్తి కూడా కీలకపాత్రలో కనిపించారు. గోడపత్రిక కాన్సెప్ట్‌లో కనిపించిన మూర్తి.. యాక్షన్ ఎపిసోడ్‌లో కూడా భాగం అయ్యారు. అయితే టీవీ 5 మూర్తి.. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడనే ముద్ర ఉంది. అలాంటి వ్యక్తిని రాజధాని ఫైల్స్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా చూపించారు కానీ.. ఆ పాత్రను వేరే వాళ్లు చేసి ఉంటే నిజాయితీగా అనిపించేది. ఈయన ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు కదా.. ఈ పాత్ర ద్వారా కొత్తగా చెప్పేదేముంది? అనే ఫీల్ కలుగుతుంది.

చాలారోజుల తరువాత వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్‌లు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు. రాజధాని ప్రాంత రైతులుగా జీవించేశారు. రైతుల కోసం పోరాడే యువరైతుగా అఖిలన్‌కి మంచి పాత్రే దక్కింది కానీ.. చివర్లో టెక్నాలజీ స్పెషలిస్ట్ అంటూ అతని పాత్రను కిచిడీ చేసేశారు. అయితే చాలా వరకూ రాజధాని ఫైల్స్ చిత్రంలో రాజధాని ప్రాంత రైతుల్ని చూపించడంతో.. రియాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది. ఒరిజినల్ లొకేషన్స్‌లో చిత్రీకరించడం వల్ల.. రాజధాని ప్రాంతాన్ని కళ్ల ముందు ఉంచినట్టుగా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఏరువాక సాంగ్‌లో అమృత చౌదరి మెప్పించింది. మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. అయితే ఈ సినిమాకి నిడివి పెద్ద మైనస్. చెప్పాల్సిన విషయాన్ని ఎంత క్లుప్తంగా చెప్తే ఆడియన్స్‌కి అంత ఈజీగా కనెక్ట్ అవుతుంది. కానీ రాజధాని ఫైల్స్‌లో ప్రసంగాలు ఎక్కువ అయిపోవడంతో.. ప్రేక్షకులక సహనానికి పరీక్షగా మారింది. సమస్య సామాన్యుడికి అర్ధం అయ్యేలా కాకుండా చివరికి వచ్చేసరికి డాక్యుమెంటరీగా మారింది.

సినిమా ఓవరాల్‌గా.. 

 Rajdhani Files Movie Review-2024: రాజధాని ఫైల్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని చేరువకాలేకపోవచ్చు కానీ.. రాజధాని ప్రాంత వాసుల్లో ఆవేశాన్ని రగుల్చుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. యాత్ర, యాత్ర 2లు వన్ సైడెడ్ పొలిటికల్ అజెండాతో ఎలాగైతే వచ్చాయో.. ‘రాజధాని ఫైల్స్’ కూడా పొలిటికల్ అజెండాతో వచ్చిన సినిమానే. కాబట్టి.. ఎవరికి నచ్చుతుందో.. ఎవరికి నచ్చదో మీరే అంచనా వేయొచ్చు.

 

1 thought on “Rajdhani Files Movie Review-2024 | ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.