Medaram Sammakka Saralamma Jatara-2024 Begins Today | నేటి నుంచి మేడారం మహా జాతర.. గద్దెపైకి సారలమ్మ..
Medaram Sammakka Saralamma Jatara-2024 Begins Today: తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర వైభవంగా జరగనుంది. ఆదివాసీల ఆరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలివస్తున్నారు. నేడు సాయంత్రం సారలమ్మ గద్దెపైకి చేరుకోవటంతో జాతర ప్రారంభం కానుంది.
మహా జాతర నేటి నుంచి..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు.
నేటి నుంచి ఈ నెల 24 వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. మంగళవారం మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో జాతర ఆరంభమైంది.
సాయంత్రం 4 గంటలకు…
ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం 4 గంటలకు గద్దెపై కొలువు దీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని గద్దెలపైకి తొడ్కొని రానున్నారు. ఇక ఫిబ్రవరి 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఫిబ్రవరి 23న గద్దెలపై కొలువుదీరని తల్లులకు పూజలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
పొరుగు రాష్ట్రాలైన..
ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. దాదాపు 2 కోట్ల మంది భక్తులు గద్దెలను దర్శించుకుంటారని అంచనా. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మహా జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి గద్దెలను దర్శించుకుంటారు. గవర్నర్ తమిళిసై సాందర రాజన్, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వెళ్లనున్నారు.
జాతర ప్రత్యేక ఏర్పాట్లు..
పోలీసు శాఖ బందోబస్తు కోసం 14 వేల మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా.. రైల్వేశాఖ కూడా ప్రత్యేకంగా ట్రైన్లు నడుపుతోంది. హెలికాప్టర్‌లోనూ మేడారం వెళ్లేందుకు వీలు కల్పించారు. జాతరకు వచ్చే ప్రైవేటు వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
నాలుగు రోజుల పాటు..
మేడారం మహా జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో సెలవులు ప్రకటించారు. జాతర జరుగనున్న నాలుగు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈమేరకు జిల్లా కలెక్టరు త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు రోజులపాటు విద్యాసంస్థలను మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
2 thoughts on “Medaram Sammakka Saralamma Jatara-2024 Begins Today | నేటి నుంచి మేడారం మహా జాతర.. గద్దెపైకి సారలమ్మ..”