Table of Contents
Toggleశ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర | Biography of Sri Nandamuri Taraka Rama Rao (Sr NTR)
Biography of Sri Nandamuri Taraka Rama Rao (Sr NTR)-2024
‘అన్న’ ఎన్టీఆర్(NTR) జీవిత విశేషాలు-‘Anna’ NTR’s Life Stories:
బాల్యము – విద్యాభ్యాసం-Childhood and Education:
- 1923 మే 28 సోమవారం సాయంత్రం 4.40 నిమిషాలకు తెలుగు నేలపై గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో పుణ్యదంపతులు శ్రీమతి వెంకట్రావమ్మ, శ్రీ లక్ష్మయ్యచౌదరి గార్లకు ఎన్టీఆర్(NTR) జన్మించారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కాగా మొదటి సంతానం నందమూరి తారక రామారావు, రెండో సంతానం నందమూరి త్రివిక్రమరావు.
- 1940 – విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన ఎన్టీఆర్(NTR)… విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరారు.
- కాలేజీలో తెలుగు శాఖాధిపతిగా ‘కవి సామ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ పనిచేసేవారు. ఆయన రాసిన ‘రాచమల్లుని దౌత్యం’ నాటకంలో కథానాయిక పాత్ర పోషించారు ఎన్టీఆర్(NTR). అదే ఆయన తొలి నటన.. పోషించిన తొలి పాత్ర. ఆ నాటక పోటీల్లో ఆయనకు ప్రథమ బహుమతి లభించింది.
- 1942 మే 2న రాత్రి 3.23 నిమిషాలకు… కొమరవోలు గ్రామంలో మేనమామ కాట్రగడ్డ చెంచయ్య కూతురు బసవరామతారకం గారితో ఎన్టీఆర్(NTR) వివాహం జరిగింది.
- 1944లో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బి.ఎ. కోర్సులో చేరారు.
- 1947లో నాటకాల మీద ఇష్టంతో కళాశాల స్నేహితులతో కలిసి ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ అనే నాటక సంస్థను స్థాపించారు ఎన్టీఆర్(NTR).
- 1947 మే 21 – మదరాసు శోభనాచల స్టూడియో (తర్వాతి కాలంలో వీనస్ స్టూడియో అయ్యింది) ఎన్టీఆర్(NTR) కు మేకప్ టెస్ట్ జరిగింది. మేకప్ మెన్ మంగయ్య గారు మేకప్ చేయగా, జైహింద్ సత్యం (మన సత్యం) గారు స్టిల్స్ తీశారు.
- 1947 – ఎన్టీఆర్(NTR) బి.ఎ. పట్టభద్రులయ్యారు. అదే సమయంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర సర్వీస్ కమిషన్ వారు సబ్ రిజిస్ట్రార్ పోస్టుల కోసం ప్రకటన ఇచ్చారు. 7,000 మంది దరఖాస్తు చేసుకోగా కమిషన్ ఎంపిక చేసిన 14 మందిలో ఎన్టీఆర్(NTR) ఒకరు. గుంటూరులో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగంలో చేరారు.
ఎన్టీఆర్(NTR) సినీరంగ ప్రస్థానం-NTR’s film career:
- 1949 నవంబర్ 24 – దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ సినిమా ‘మనదేశం’ విడుదలైంది. ఈ సినిమాలో పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ పాత్రతో నటునిగా ఎన్టీఆర్(NTR) సినీరంగ ప్రస్థానం మొదలైంది. 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు కలిపి మొత్తం 298 సినిమాలు చేసారు ఎన్టీఆర్(NTR). వీటిల్లో 16 తమిళ సినిమాలు, 3 హిందీ సినిమాలు ఉన్నాయి.
- 1950 ఏప్రిల్ 27 – ఎన్టీఆర్(NTR) కి హీరో గుర్తింపును ఇచ్చిన చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ విడుదల. మరో అగ్ర కథానాయకుడు ఏఎన్నార్ తో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే.
- 1951 మార్చి 15 – ఎన్టీఆర్(NTR) ని అగ్రశ్రేణి కథానాయకునిగా నిలబెట్టి, అశేష అభిమానులను సంపాదించి పెట్టిన చిత్రం ‘పాతాళభైరవి’ విడుదల. ద్విశత దినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే.
- 1951 డిసెంబర్ 20న ఆనాటి అద్భుత దృశ్యకావ్యం ‘మల్లీశ్వరి’ విడుదలై వ్యాపార పరంగా విజయం సాధించడంతో పాటు ప్రశంసలు, అవార్డులు అందుకుంది. పలు దేశాల్లో చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది.
- 1952 – రాయలసీమలో కరువు సంభవిస్తే… తోటి నటీనటులతో నెల రోజుల పాటు పలుచోట్ల ప్రదర్శనలిచ్చి, వీదుల్లో జోలెపట్టి లక్షా 50 వేల రూపాయలు (ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కేస్తే 2022 నాటి విలువ ప్రకారం సుమారు రూ.1 కోటి 33 లక్షల 10వేలు… కొనుగోలు సామర్థ్యాన్ని జోడిస్తే రూ.4 కోట్ల 24 లక్షల 50వేలు ) సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా సహాయ కార్యక్రమాలకు అందజేశారు.
- 1953 జూలై 17 – ఎన్టీఆర్(NTR) నిర్మాతగా మారి సొంత నిర్మాణ సంస్థ NAT (నేషనల్ ఆర్ట్ థియేటర్) ద్వారా నిర్మించిన ‘పిచ్చి పుల్లయ్య’ విడుదలైంది.
- 1953 ఆగస్టు 28 – తొలి తెలుగు పాన్ ఇండియా చిత్రం ‘చండీరాణి’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదల. ఈ చిత్రానికి భానుమతి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
- 1954 ఏప్రిల్ 15 – ఎన్టీఆర్(NTR) కు మొదటి జాతీయ అవార్డు (రాష్ట్రపతి ప్రశంసా పత్రం) తెచ్చిపెట్టిన ‘తోడు దొంగలు’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి నిర్మాత ఎన్టీఆరే.
- 1954 అక్టోబర్ 6 – ఎన్టీఆర్(NTR) మొదటిసారిగా శ్రీకృష్ణ పాత్రలో (అంతర్నాటకం) కనిపించిన ‘ఇద్దరు పెళ్ళాలు’ సినిమా విడుదల.
- 1956 డిసెంబర్ 20 – ఎన్టీఆర్(NTR) తొలిసారిగా రాముని వేషధారణలో కనిపించిన సాంఘిక చిత్రం ‘చరణదాసి’ విడుదల. 1958లో విడుదలైన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో ఎన్టీఆర్(NTR) రాముడిగా నటించారు. రాముడుగా ఎన్టీఆర్(NTR) నటించిన తొలి పూర్తి నిడివి చిత్రం ఇదే.
- 1957 మార్చి 27 – ఎన్టీఆర్(NTR) శ్రీకృష్ణుడిగా ఆబాలగోపాలాన్ని సమ్మోహన పరచిన అద్భుత చిత్రం ‘మాయాబజార్’ విడుదల. ఎన్టీఆర్(NTR) ను కథానాయకుడి స్థాయి నుంచి వెండితెర వేలుపుగా మార్చిన చిత్రం ఇది. ఎన్టీఆర్(NTR) కృష్ణుడి వేషధారణలో ఉన్న క్యాలెండర్ లను ముద్రించగా ఆ రోజుల్లో 5 లక్షల కాపీలు అమ్ముడు పోవడం ఒక రికార్డు. అది మొదలు తన నటనా జీవితంలో 18 చిత్రాల్లో కృష్ణునిగా నటించారు ఎన్టీఆర్(NTR). సాంఘిక చిత్రాల్లో వచ్చే అంతర్నాటకాలతో కలిపితే 33 సార్లు కృష్ణునిగా కనిపించారు.
- 1957 ఆగస్టు 15 – మద్రాసు కోడంబాకంలో స్వగృహ ప్రవేశం.
- 1960 జనవరి 9 – ఎన్టీఆర్(NTR) తొలిసారిగా శ్రీనివాసుని పాత్రలో నటించిన ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రం విడుదల. అఖండ విజయం సాధించిన ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్(NTR) ను సాక్షాత్తు శ్రీనివాసుడిగా భావించారు ప్రేక్షకులు. అప్పట్లో భక్తులు కానుకలు సమర్పించుకోడానికి థియేటర్ల వద్ద ప్రత్యేకంగా హుండీలను పెట్టాల్సి వచ్చింది. తిరుపతికి వెళ్లిన భక్తులు అట్నుంచి అటే మదరాసులో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన దర్శనం కోరడం ఆనవాయితీగా మారింది.
- 1961 జనవరి 6 – ఎన్టీఆర్(NTR) తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతారామ కళ్యాణం’ విడుదల. ఎన్టీఆర్(NTR) నటనకు ముగ్ధులైన కంచి పీఠాదిపతి చంద్రశేఖర స్వామి వారు ఆయనను సహపంక్తి భోజనానికి ఆహ్వానించారు.
- 1962 మే 10 – ఎన్టీఆర్(NTR) తొలిసారిగా శివుని వేషం కట్టిన ‘దక్షయజ్ఞం’ విడుదల.
- 1962 మే 27 – నందమూరి ఇంట విషాదం. మశూచికం సోకి నిమ్మకూరులో ఎన్టీఆర్(NTR) పెద్ద కుమారుడు రామకృష్ణ అకాల మరణం.
- 1962 – పుత్ర శోకం తీరకుండానే భారత-చైనా యుద్ధ సమయంలో జాతీయ రక్షణ నిధికి రూ.10 లక్షల విరాళాలు సేకరించి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారికి అందజేశారు ఎన్టీఆర్(NTR).
- 1963 మార్చి 29 – ఉగాది కానుకగా తొలి తెలుగు రంగుల చిత్రం ‘లవకుశ’ విడుదల. నందమూరి తారక రాముని అవతార పురుషునిగా, వెండితెర వేలుపుగా ప్రతి తెలుగు హృదయంలో నిలిపిన చిత్రం ఇది. అంతేకాదు రాబట్టిన వసూళ్లను పత్రికల్లో ప్రకటించిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే.
- 1963 అక్టోబర్ 11 – ఎన్టీఆర్(NTR) వైవిధ్య నటనకు నిదర్శనంగా ‘నర్తనశాల’ చిత్రం విడుదల. ఈ చిత్రంలో బృహన్నల పాత్ర కోసం నలభై ఏళ్ళ వయసులో వెంపటి చినసత్యం గారి దగ్గర మూడు నెలలపాటు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఎన్టీఆర్(NTR).
- 1964 మే 21 – ఎన్టీఆర్(NTR) ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు భీముడు’ విడుదల.
- 1964 హైదరాబాద్ నిజాం కళాశాల ఆవరణలో నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేతుల మీదుగా ఎన్టీఆర్(NTR) కు ‘నటరత్న’ బిరుదు ప్రదానం.
- 1964 జూన్ 24 విజయవాడ కృష్ణలంక అగ్నిప్రమాద బాధితుల సహాయార్థం ‘ఎన్టీఆర్(NTR) దాతృత్వ సంస్థ’ ద్వారా లక్ష రూపాయల విరాళం సేకరించి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి అందచేశారు ఎన్టీఆర్(NTR).
- 1964 నర్తనశాల, లవకుశ, కర్ణ చిత్రాలకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా జాతీయ అవార్డులు.
- 1965 పలు ప్రదర్శనలు ఇచ్చి “పోలీసు కానిస్టేబుళ్ల రక్షణ నిధి”కి 3 లక్షల రూపాయల విరాళం అందజేత.
- 1965 డిసెంబర్ 16 – భారత-పాకిస్థాన్ యుద్ధ సమయంలో జాతీయ రక్షణ నిధికి భారీ విరాళాలు సేకరించి నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అందజేత.
- 1968 ఏప్రిల్ 16 – నందమూరి కీర్తి కిరీటానికి మరో కలికితురాయి. భారత ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’ అవార్దు ప్రదానం.
- 1969 – కోస్తాలో భీకర తుఫాను బాధితుల కోసం రూ.5 లక్షల విరాళాల సేకరణ.
- 1969 – సామాజిక దురాచార నిర్మూలన ముఖ్యోద్దేశంగా ఎన్టీఆర్(NTR) నిర్మించి, దర్శకత్వం వహించిన ‘వరకట్నం’ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వంచే ‘ఉత్తమ దర్శకుడు’ అవార్డు అందుకున్న ఎన్టీఆర్(NTR).
- 1972 నవంబర్ 30 – ఎన్టీఆర్(NTR) కు ‘ఉత్తమ తెలుగు నటుడు’ ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టిన ‘బడిపంతులు’ చిత్రం విడుదల.
- 1973 ఫిబ్రవరి 2 – భారతదేశంలో 1972లో ఏర్పడిన కరవు సహాయ నిధి కోసం నాటక ప్రదర్శనల ద్వారా సేకరించిన రూ.7 లక్షలకు పైగా నిధులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి అందజేసారు ఎన్టీఆర్(NTR).
- 1975 నవరసాలను అద్భుతంగా పోషించగల అసమాన నటుడవు నీవంటూ… ఎన్టీఆర్(NTR) కు ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ బిరుదును ఇచ్చి ఆశీర్వదించిన శ్రీశైల జగద్గురు పీఠాదిపతులు వాగీశ పండితారాధ్య శివాచార్యులు.
- 1977 జనవరి 14 – ఎన్టీఆర్(NTR) త్రిపాత్రాభినయం చేస్తూ… స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందించిన అజరామర చిత్రం ‘దానవీరశూరకర్ణ’ విడుదల.
- 1977 ఏప్రిల్ 28 – తెలుగు చలన చిత్రసీమలో కలెక్షన్ల రికార్డులను తిరగరాసి, సరికొత్త చరిత్ర సృష్టించిన ‘అడవిరాముడు’ చిత్రం విడుదల.
- 1977 నవంబర్ 19 – దివిసీమ ఉప్పెన తెలుగునేలపై కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్(NTR) ను తీవ్రంగా కదిలించి, పేదల కోసం ఏదైనా చేయాలని తపించేలా చేసిన ప్రకృతి ప్రకోపం అది. తోటి కళాకారులతో కలిసి జోలె పట్టి రూ.15 లక్షల నిధులను రామకృష్ణ మిషన్ ద్వారా బాధితులకు అందచేశారు ఎన్టీఆర్(NTR).
- 1978 విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్… ‘కళాప్రపూర్ణ’ బిరుదును అందుకున్నారు ఎన్టీఆర్(NTR).
ఎన్టీఆర్(NTR) రాజకీయ ప్రవేశం – తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం – NTR’s entry into politics – Formation of Telugu Desam Party (TDP):
- 1980 అక్టోబర్ 30 – తనను ఎంతగానో అభిమానించి, ఆరాధించే తెలుగువారి రుణం ఎలా తీర్చుకోవాలి అన్న ఎన్టీఆర్(NTR) ఆలోచనకు ప్రేరణ ఇచ్చిన చిత్రం ‘సర్దార్ పాపారాయుడు’ విడుదల.
- ఇకపై నెలకు 15 రోజులు తెలుగుప్రజల సేవకు కేటాయిస్తానని ఎన్టీఆర్(NTR) విలేఖరుల సమావేశం పెట్టి ఊటీలో వెల్లడించారు.
- 1982 మార్చి 21 (సా 6.15 ని.లకు) – రామకృష్ణ స్టూడియోలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించారు ఎన్టీఆర్(NTR).
- 1982 మార్చి 29 (మధ్యాహ్నం గం.2.30 ని.లకు) – హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ‘తెలుగుదేశం’ పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్(NTR).
- 1982 ఏప్రిల్ 10,11 తేదీలు – హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ మొదటి బహిరంగ సభలు.
- 1982 మే 27, 28 తేదీలు – తిరుపతిలోని త్యాగరాయ మండపంలో యావద్భారతావని దృష్టిని ఆకర్షించిన మహానాడు తరహా సభలు.
- 1982 జూన్ 14 – తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ప్రజలను చైతన్య పరచడానికి ఎన్టీఆర్(NTR) మొదటి ప్రచార యాత్ర ప్రారంభమైంది.
- పాత చెవ్రొలెట్ వ్యానును రిపేరు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించి ‘చైతన్య రథం’ అని నామకరణం చేసారు ఎన్టీఆర్(NTR).
- ఎన్టీఆర్(NTR) చైతన్య రథానికి నందమూరి హరికృష్ణే సారథి. ఎన్టీఆర్(NTR) ఓ శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను దోచుకుంటే… ఆ వాహనాన్ని కొడుకు హరికృష్ణ నడుపుతూ తండ్రి ఆశయాలకు చేదోడుగా నిలిచాడు.
- రాత్రి లేదు పగలు లేదు. నటుడిగా తాను సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, వైభవం అన్నిటినీ మరిచి… సామాన్యుడి కోసం నడిరోడ్డుపై నిలిచాడు రామన్న. ఆ రోడ్డే ఆయనకు ఇల్లయ్యింది. తల్లి అయ్యింది. చెట్టు నీడే పడకగది అయ్యింది. “తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలిరా!!” అన్న ఎన్టీఆర్(NTR) పిలుపు ప్రతి తెలుగు హృదయాన్ని తట్టి లేపింది.
- 1982 అక్టోబర్ 3 – ఎన్టీఆర్(NTR) రెండవ ప్రచార యాత్ర ప్రారంభం. నవంబర్ 26, 1982 వరకూ 55 రోజుల పాటు సాగిన ఈ 25 వేల కిలోమీటర్ల ప్రచార యాత్ర నభూతో- నభవిష్యతి.
- “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా” అంటూ చైతన్య రథం కదిలి వస్తుంటే జనం పులకరించి పూనకమెత్తారు. సాగర తరంగాలై పోటెత్తారు.
- 1982 డిసెంబర్ 16 ఎన్టీఆర్(NTR) మూడవ ప్రచార యాత్ర. ఈ ప్రచారంలో 72 గంటల పాటు నిద్రాహారాలు మాని నిర్విరామంగా ప్రచారం సాగించి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్(NTR).
- 1982 డిసెంబర్ 21 రాత్రి – “ప్రపంచంలో ఇంతవరకూ ఎవ్వరూ ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోట్ల, ఇన్ని లక్షల ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించ లేదు” అంటూ ఎన్టీఆర్(NTR) గురించి BBC తన వార్తాప్రసారంలో గొప్పగా చెప్పింది. తెలుగు జాతి గురించి ప్రపంచానికి గొప్పగా వినిపించిన రోజది.
- 1983 జనవరి 5 – ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం.
- 1983 జనవరి 9 – ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రప్రథమంగా… తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రజానేత ఎన్టీఆర్(NTR) ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా బహిరంగ ప్రమాణ స్వీకారం.
తెలుగునాట రామరాజ్య పాలన ప్రారంభం-Beginning of Ramarajya rule in Telugu Nadu:
- 1983 ఏప్రిల్ 14 – ఉగాది నాడు తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో కాషాయ వస్త్రధారణతో రాజయోగిగా మారిన ఎన్టీఆర్(NTR).
- 1983 ఏప్రిల్ 14 – తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపన.
- 1983 ఏప్రిల్ 27 – ప్రతిష్టాత్మక తెలుగుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన.
- 1983 మే 27,28,29 – విజయవాడలో తొలి మహానాడు. దేశంలోని జాతీయ, ప్రాంతీయ నేతలంతా హాజరు.
- 1983 జూలై 6 – దేశంలోనే మొదటిసారిగా కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రారంభం.
- 1984 మార్చి 23 – దేశ ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి విజయవాడలో దూరదర్శన్ కేంద్రానికి ప్రారంభోత్సవం.
- 1984 జులై 18 – అమెరికాలో ఎన్టీఆర్(NTR) కు బైపాస్ సర్జరీ.
- 1984 ఆగస్టు 16 – ఎన్టీఆర్(NTR) ను తప్పించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్.
- 1984 ఆగస్టు – ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట ఎన్టీఆర్(NTR) ప్రజాయాత్ర. ప్రజాస్వామ్యంలో జరిగిన అతిగొప్ప ప్రజావిప్లవంగా రూపొందింది.
- 1984 సెప్టెంబర్ 5 – ఎన్టీఆర్(NTR) ధర్మపత్ని బసవతారకమ్మను మద్రాసు అడయార్ లోని కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు.
- నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుని ఎన్టీఆర్(NTR) వెంట 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బలనిరూపణలో రుజువుచేసారు.
- 1984 సెప్టెంబర్ 15 – ముఖ్యమంత్రిగా మరోసారి పదవిని చేపట్టిన ఎన్టీఆర్(NTR).
- 1984 సెప్టెంబర్ 19 – ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో మొదటి అవిశ్వాస తీర్మాన బలపరీక్షలో ఎన్టీఆర్(NTR) విజయం.
- 1984 అక్టోబర్ 1 (సాయంత్రం గం.6. 15 నిమిషాలకు) – మద్రాసులో శివైక్యం చెందిన బసవతారకమ్మ.
- 1984 నవంబర్ – 60 ఏళ్ళు పైబడిన భూమిలేని రైతులకు, రైతు కూలీలకు ‘తెలుగు వ్యవసాయ కార్మిక సాదర సంక్షేమం’ పథకం పేరిట… దేశంలో మొదటిసారిగా నెలకు రూ.35 పింఛను.
- 1984 నవంబర్ 23 – ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు.
- 1984 డిసెంబర్ 27 – ప్రధాని ఇందిరా గాంధీ హత్యతో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు. దేశమంతా సానుభూతి పవనాలు వీచినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్టీఆర్(NTR) ప్రభంజనం కొనసాగింది. తెలుగుదేశం పార్టీకి 30 పార్లమెంటు స్థానాలు దక్కాయి. భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం స్థాయిని దక్కించుకుని ఈ ఘనతను సాధించిన మొదటి ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించింది తెలుగుదేశం.
- 1985 మార్చి 5 – ఆంధ్రప్రదేశ్ శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం
- 1985 మార్చి 9 – ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన ఎన్టీఆర్(NTR).
- 1985 ఏప్రిల్ 6 – తిరుపతి తిరుమల దేవస్థానం వారిచే నిత్యాన్నదాన మహత్కార్యానికి శ్రీకారం.
- 1985 శాసనమండలి రద్దు.
- 1985 రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా కరణం, మునసబు, పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి, మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణకు బాటలు వేశారు ఎన్టీఆర్(NTR). బడుగు బలహీన వర్గాల రాజకీయ బానిస సంకెళ్లను తెంపి, వారి చేతికి అధికార కరవాలం అందించిన సమసమాజవాది ఎన్టీఆర్(NTR).
- 1985 సెప్టెంబర్ 9 – దేశంలో మొదటిసారిగా తండ్రి ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం.
- 1985 అక్టోబర్ – హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసేందుకు బుద్ధ విగ్రహ పనులు ప్రారంభం.
- 1985 డిసెంబర్ స్థానికేతరులను వారివారి ప్రాంతాలకు పంపడానికి 610 జీఓ జారీ.
- 1985 డిసెంబర్ 2 హైదరాబాద్‌లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు.
- ఏప్రిల్ 18, 1986 – దేశంలో మొదటిసారిగా రూ.165 కోట్లతో 1,70,000 నిరుపేద కుటుంబాలకు ‘నీడ’ పథకం కింద శాశ్వత గృహాలు కట్టించిన ఎన్టీఆర్(NTR).
- 1987 హర్యానా ఎన్నికల్లో దేవీలాల్ కు మద్దతుగా ప్రచారం. ఆ ఎన్నికల్లో భారీ విజయం సాధించి హర్యానా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన దేవీలాల్
- 1988 సెప్టెంబర్ 17 – మద్రాసు మెరీనా బీచ్ లో నేషనల్ ఫ్రంట్ మొదటి సమావేశం… చైర్మన్ గా ఎన్టీఆర్(NTR) ను ఎన్నుకున్న నాయకులు.
- 1988 అక్టోబర్ 3 – ముంబైలో ఫ్రంట్ నేతల భారీ సభ. హర్యానా తలపాగా చుట్టుకుని ప్రసంగించిన ఎన్టీఆర్(NTR).
- 1989 జూన్ 18 – ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్ర నిర్మాణం ప్రారంభం. ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నటన ప్రారంభించిన ఎన్టీఆర్(NTR).
- 1989 – రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం.
- 1993 ఏప్రిల్ 23 – ఎన్టీఆర్(NTR) నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ విడుదల.
- 1994 డిసెంబర్ 12 – ఎన్టీఆర్(NTR) నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు.
- 1996 జనవరి 18 – నందమూరి తారక రాముని అస్తమయం.
తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్(NTR) ఉంటారు. ఎన్టీఆర్(NTR) తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టడమన్నది వెండి తెర చేసుకున్న మహద్భాగ్యం. అక్కడితో ఆగిపోకుండా రాజకీయాల్లోకి వచ్చి తెలుగు నేలకు, జాతికీ ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడమే కాకుండా తెలుగు ప్రజలకు ‘సేవ చేసే రాజకీయాల’ను పరిచయం చేసారు ఎన్టీఆర్(NTR).
2023 మే 28వ తేదీ శక పురుషుడు ఎన్టీఆర్(NTR) శత జయంతి రోజు. ఆ రోజుకు ఏడాది ముందు నుంచే ఎన్టీఆర్(NTR) శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది తెలుగుదేశం.
పార్టీ సిద్ధాంతం (సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు)-TDP Party theory
సేవ చేయడమే రాజకీయం:
సమాజానికి నిస్వార్థ సేవ చేయడమే నిజమైన రాజకీయం అన్నది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు (అన్న ఎన్టీఆర్) గారి మూల సిద్ధాంతం. “సంఘం శరణం గచ్ఛామి” అన్న బుద్ధ భగవానుని సూక్తి నుండే తాను స్ఫూర్తిని పొంది “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అన్న నినాదాన్ని తెలుగుదేశం పార్టీకి అందించానని అన్న ఎన్టీఆర్ చెప్పారు.
అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించేనాటికి దేశంలో అనేక రాజకీయ పార్టీలు వివిధ సిద్ధాంతాలతో పనిచేస్తున్నాయి. అలాంటి సమయంలో “నేను సోషలిస్ట్ నో, కమ్యూనిస్టునో, కాపిటలిస్టునో కాదు.. నేను హ్యూమనిస్టుని” అన్నారు ఎన్టీఆర్. అంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు మానవత్వమే అసలైన పునాది-Biography of Sri Nandamuri Taraka Rama Rao (Sr NTR)-2024.
పేదరిక నిర్మూలన:
“పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం” అన్నది అన్న ఎన్టీఆర్ భావన. కండలు కరిగించి, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, రక్తాన్ని చెమరిస్తూ కూడా అర్థాకలితో అలమటించే కార్మిక సోదరులు… మట్టిలో మాణిక్యాలు పండించినా తన పంటకు తగినంత విలువ లభించక ముడుచుకుపోతున్న కర్షక సోదరులు… ఇటువంటి సామాన్యులందరికీ కేవలం ప్రాథమిక అవసరాలైన తిండి, గుడ్డ, నీడ అందివ్వడమే కాకుండా… అభివృద్ధి కార్యక్రమాలతో వారి బ్రతుకులు పండించాలి. పేదలకు సైతం మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన సౌకర్యాలను… విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి పేదరికం నుండి వారికి విముక్తిని కల్పించాలి అన్నదే తెలుగుదేశం సిద్ధాంతం.
సమసమాజం :
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటినా సామాజిక రక్షణ కరువై ధన బలవంతులు, కుల అహంకారుల చేత అణగదొక్కబడుతున్న అల్ప సంఖ్యాకులకు, హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతుల వారికి….
జనాభాలో దాదాపు సగభాగమైనప్పటికీ సమాన హక్కులకు నోచుకోలేక … వరకట్నం వంటి అనాగరిక సంప్రదాయాలలో, సాంఘిక దురాచారాలలో మగ్గిపోతూ అవమానాల పాలై నలిగిపోతున్న ఆడపడుచులకు… ఆర్థిక స్వేచ్ఛ లేక పురుష అహంకారానికి తలొగ్గి బతుకీడుస్తున్న స్త్రీలకు…
వీరందరికీ స్వతంత్ర జీవనం కల్పించడం… సమాజంలో సమాన హోదా కోసం ఆర్థిక పుష్టిని, సాధికారతను కలిగించడం… విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో సమానావకాశాలు అందించడం… రాజకీయ ప్రాతినిధ్యానికి చోటివ్వడం … తెలుగుదేశం సిద్ధాంతం. అంతేకాదు బడుగులకు, మహిళలకు అత్యాచారాలు, హత్యాచారాలు, దాడుల నుండి రక్షణ కల్పించడం, నిర్భయంగా బతికే, స్వేచ్ఛగా ఎదిగే వీలు కల్పించడం తెలుగుదేశం పరమావధి.
తెలుగువారికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం:
తెలుగుదేశం ఒక పార్టీ కాదు, ఒక మహా ఉద్యమం. తెలుగువారి ఆత్మగౌరవం అవమానింపబడుతున్న దశలో తెలుగు ప్రజల ఆవేదన నుంచి పుట్టుకొచ్చిన ఆవేశం తెలుగుదేశం. తెలుగువారి సేవలో తరిస్తూ… తెలుగునేలకు ఖండాంతర ఖ్యాతిని తేవడం తెలుగుదేశం సిద్ధాంతం. ప్రతి తెలుగువాడినీ అన్నిరకాలుగా సమర్థుడిగా తీర్చిదిద్ది.. తాను ఏదైనా సాధించగలననే ఆత్వవిశ్వాసాన్ని వారిలో కలిగించడం తెలుగుదేశం సిద్ధాంతం. తెలుగు నేలపై మమకారాన్ని పెంచి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షింపజేయడం… రానున్న తరాలకు ఆ ఘన వారసత్వాన్ని సంక్రమింపజేయడం తెలుగుదేశం పార్టీ తన నైతిక బాధ్యతగా స్వీకరించింది.
ప్రజాస్వామ్య పరిరక్షణ – ప్రజా హక్కుల గౌరవం:
ప్రజాస్వామ్యాన్ని ఒక విశిష్ట జీవన విధానంగా, చారిత్రక పరిణామక్రమంలో మానవజాతి అశేష త్యాగాలు చేసి సాధించుకున్న వరంగా భావిస్తుంది తెలుగుదేశం. ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడటం… ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం తెలుగుదేశం పార్టీ పవిత్ర కర్తవ్యం.
జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం-Telugu Desam’s influence on national politics.
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. ఆవిర్భవించిన 9నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ నాయకత్వం… నాటి జాతీయ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ కు ప్రశ్నార్థకంగా మారాయి. కాంగ్రెసేతర పార్టీలకు ఎన్టీఆర్ ఒక దిక్సూచిలా నిలిచారు. రాష్ట్ర రాజకీయాలను మార్చిన ఎన్టీఆర్ సైతం అదే ఆత్మవిశ్వాసంతో దేశ రాజకీయాలను కాంగ్రెస్ గుత్తాధిపత్యం నుంచి విడదీసేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ తాను అధికారంలోకి వచ్చిన ఆరునెలల లోపే మే 28, 1983న తన పుట్టినరోజు సందర్భాన్ని ఇందుకు ఉపయోగించుకున్నారుBiography of Sri Nandamuri Taraka Rama Rao (Sr NTR)-2024.
విజయవాడలో తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ… జాతీయ స్థాయి నేతలతో విజయవాడలో ఎంజిఆర్ అద్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. నాటి సమావేశానికి బాబు జగ్జీవన్ రామ్, చండ్ర రాజేశ్వరరావు, హెచ్ ఎన్ బహుగుణ, ఎల్ కె అద్వానీ, శరద్ పవార్, రామకృష్ణ హెగ్డే, మాకినేని బసవ పున్నయ్య వంటి ఉద్ధండులు హాజరయ్యారు.
ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 డిసెంబర్ లో జరిగిన లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగడంతో దేశమంతా సానుభూతి పవనాలు వీచాయి. దేశంలోని రాష్ట్రాలన్నింటా కాగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్టీఆర్ సమ్మోహన శక్తి ముందు ఆ సానుభూతి పనిచేయలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలిచి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది తెలుగుదేశం. ఆ రికార్డు సృష్టించిన మొదటి ప్రాంతీయ పార్టీగా చరిత్రలో నిలిచింది.
ఈ విజయంతో దేశవ్యాప్త రాజకీయాలలో పెను మార్పులు వచ్చాయి. కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒకే గూటి కిందకు చేరే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరో వైపు ఎన్టీఆర్ చరిష్మాను తమ రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకోడానికి నేతలు ఉవ్విళ్లూరారు.
1987 హర్యానా శాసనసభ ఎన్నికల్లో కొత్తగా స్థాపించిన లోక్‌దళ్ పార్టీ నేత దేవీలాల్ తనకు మద్దతుగా ప్రచారం చేయమని ఎన్టీఆర్ ను కోరారు. దేవీలాల్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ తన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో వెళ్లారు. ఆ ఎన్నికల్లో లోక్ దళ్ పార్టీ 90కి గాను 85 స్థానాలు సాధించి కాంగ్రెస్ ను 5 స్థానాలకే పరిమితం చేసి రికార్డు సృష్టించింది. దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.Biography of Sri Nandamuri Taraka Rama Rao (Sr NTR)-2024
ఇదే ఊపుతో సెప్టెంబర్ 17, 1988న తొమ్మిది కాంగ్రెసేతర జాతీయ స్థాయి పార్టీల నేతల ఆధ్వర్యంలో మద్రాసు మెరీనా బీచ్ లో ‘నేషనల్ ఫ్రంట్’ మొదటి సమావేశం జరిగింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగా డిసెంబర్ 1989 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది. నాడు వీపీ సింగ్ ప్రధానిగా, దేవీలాల్ ఉపప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ను ప్రధాని పదవి చేపట్టమని ఫ్రంట్ నేతలు కోరినా ఎన్టీఆర్ తెలుగు వారి సేవకే ప్రాధాన్యమిచ్చారు.
ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు, 1996లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ, ఆ తర్వాత ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ప్రముఖ పాత్ర పోషించారు.
తరువాత 1999లో బి.జె.పి అధ్వర్యంలోని ఎన్.డి.ఎ కు జాతీయ కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబు… 29 పార్లమెంటరీ సీట్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించి సంకీర్ణ ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజపాయ్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు.
దళిత వర్గానికి చెందిన కె ఆర్ నారాయణన్, మైనారిటీ వర్గానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం లను రాష్ట్రపతులుగా చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు చంద్రబాబు.
ఎన్టీఆర్ అయినా చంద్రబాబు అయినా… ఈ కింగ్ మేకర్స్ ఇద్దరికీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా… తెలుగు ప్రజల పై మమకారంతో రాష్ట్ర స్థాయికి పరిమితమై పోయారు.
కాకపోతే కేంద్రంలో తనకున్న పలుకుబడితో తన రాష్ట్రానికి కావాల్సిన వాటిని ఎన్నింటినో తెచ్చుకోగలిగారు చంద్రబాబు. హైదరాబాద్ లో ఏర్పాటైన ఐఆర్డీఏ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హైటెక్‌సిటిలు మాత్రమే కాదు… ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కూడా ఆ కాలంలోనే చంద్రబాబు సాధించారు. అంతేకాదు 2002లో 32వ జాతీయ క్రీడలను, 2003లో మొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ ను నిర్వహించి తన పాలనా స్థాయిని, సమర్థతను ప్రపంచ స్థాయిలో చెప్పుకునేలా చేసారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, యాసర్ అరాఫత్, ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ వంటి ప్రముఖులు తమ భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సందర్శనను తప్పనిసరిగా చేర్చుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని తీసుకువెళ్లారు చంద్రబాబు.
జై హింద్ – జై తెలుగుదేశం
“జననీ జన్మ భూమిశ్చ… స్వర్గాదపీ గరీయసీ”
ఎన్నో త్యాగాలతో, మరెంతో దీక్షతో, రక్తతర్పణం చేసి స్వరాజ్యాన్ని సాధించుకుంది భరత జాతి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో తెలుగు వీరులు సైతం వీరకిశోరాలై పోరాడారు. తెలుగునాట దేశభక్తులకు, సాహస వీరులకు కొదవే లేదని చాటారు.
మన్యం ప్రజలను సంఘటితపరచి ఒక్కొక్కరినీ ఒక్కొక్క వీరుడుగా తీర్చిదిద్ది తెల్లదొరల గుండెలదరగొట్టిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు… గుండెను తుపాకీ గుండ్లకు ఎదురొడ్డిన ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం… చీరాల-పేరాల సత్యాగ్రహ సారథి ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య, ‘దేశోద్ధారక’ నాగేశ్వరరావు, ‘రైతు బాంధవుడు’ ఆచార్య రంగా… స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వంటి యోధానుయోధులు ఎందరో తెలుగు నేలపై నిలిచి స్వతంత్ర భారతావని కోసం జీవితాలను అంకితం చేసారు
అటువంటి మహానుభావుల మహత్తర త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలం ఆసేతు హిమాచలం అందరికీ సమానంగా దక్కాలి అన్నదే తెలుగుదేశం ఆకాంక్ష.
న్యాయబద్ధమైన ప్రాంతీయ అవసరాల కోసం, హక్కుల కోసం పోరాడుతూనే… సుదృఢమైన దేశ నిర్మాణం కోసం జాతీయ వాద నిబద్ధతతో కృషిచేసిన పార్టీ తెలుగుదేశం. కాబట్టే జాతీయ రాజకీయాలలో కీలక మలుపులకు కారణమై దేశ ప్రధానులను, రాష్ట్రపతులను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషించింది తెలుగుదేశం. దేశానికి తొలి దళిత స్పీకర్ ను అందించి దళితాభ్యుదయ స్ఫూర్తిని దేశానికి అందించింది. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో, సంస్కరణలతో, ప్రజా చైతన్యం, జనాభ్యుదయం సాధించిన పార్టీగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశ రాజకీయాలకు సమాఖ్య స్ఫూర్తిని గుర్తుచేసింది తెలుగుదేశం. ప్రాంతీయ తత్వంతో ఏనాడూ సంకుచిత రాజకీయాలు చేయదు తెలుగుదేశం.
తెలుగుదేశం అంటే జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం ఆకాంక్ష ఒక్కటే. తెలుగు జాతి సర్వతోముఖ సమున్నతిని సాధించాలి. తెలుగువాడు దేశానికి గర్వకారణం కావాలి.
జై హింద్… జై తెలుగుదేశం.
కార్య నిర్వాహక వర్గం
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.